టీమిండియాతో రెండో టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

డిసెంబర్ 6 నుంచి 10 వరకు భారత్ తో అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్లేయింగ్ 11 ప్రకటించాడు. ఒక్కరోజే ముందే కమ్మిన్స్ తమ తుది జట్టును చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. తొలి టెస్ట్ ఆడిన జట్టులో కేవలం ఒక్క మార్పు మాత్రమే చేశారు. గాయపడిన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు.  

జోష్ హేజల్ వుడ్ దూరం కావడంతో ఆసీస్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. అతను తొలి టెస్టులో భారత్ పై 5 వికెట్లు తీసుకొని రాణించాడు. చివరిసారిగా భారత్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులోనూ ఐదు ఓవర్లలో 8 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. దీంతో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. హేజల్ వుడ్ లేకపోయినా బోలాండ్ భారత్‌కు పెద్ద ముప్పుగా మారతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ ర్యాన్ హారిస్ అభిప్రాయపడ్డాడు. 

Also Read:-ఆసీస్‌తో రెండో టెస్టుకు ఓపెనర్ గా రాహుల్.. కన్ఫర్మ్ చేసిన రోహిత్ శర్మ

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.  పింక్ బాల్ టెస్టులో ఆసీస్ 12 టెస్టుల్లో ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. మరోవైపు చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ లో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు విషయాలు ప్రత్యర్థి ఆసీస్ జట్టుకు ఊరట కలిగిస్తున్నాయి.  

భారత్ తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11:

నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్ , ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.