ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఈ ఆదివారం(అక్టోబర్ 8) బ్లాక్ బస్టర్ మ్యాచుకు రంగం సిద్ధమైంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచుపై భారీ హైప్ నెలకొంది. చెన్నై చిదంబరం స్టేడియం ఈ మ్యాచుకు వేదిక కానుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెన్నై చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
సాధారణంగా భారత్ లో మ్యాచులంటే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చెన్నైలో మ్యాచ్ అంటే స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. టీమిండియాలో పటిష్టమైన స్పిన్నర్లు ఉండడంతో ఒత్తిడంతా ఆసీస్ పైనే ఉంటుందని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. కానీ మాకు అలాంటి భయమేమీ లేదంటున్నాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కమ్మిన్స్ "భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి మా దగ్గర ప్లాన్ ఉంది. మా కుర్రాళ్ళు స్పిన్ చాలా బాగా ఆడతారు. చాలా మంది బ్యాటర్లు భారత్ లో ఆడిన అనుభవం ఉంది. రాజ్ కోట్ లో భారత్ ని ఓడించడం మాలో ఆత్మ విస్వాసాన్ని నింపుతుంది. భారత్ లో మాకు మంచి రికార్డులు ఉన్నాయి." అని చెప్పుకొచ్చాడు. మరి కమ్మిన్స్ కాన్ఫిడెన్స్ ఆసీస్ కి అనుకూలంగా మారుతుందో లేదో చూడాలి.