T20 World Cup 2024: అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. స్కాట్లాండ్ మ్యాచ్‌పై కమ్మిన్స్

T20 World Cup 2024: అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. స్కాట్లాండ్ మ్యాచ్‌పై కమ్మిన్స్

వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ పైనే ఇంగ్లాండ్ సూపర్ 8 ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్ స్కాట్లాండ్ గెలిచినా.. లేకపోతే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ఇంగ్లాండ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్ భవితవ్యం ఆస్ట్రేలియా చేతిలో ఉంది. బలాబలాలను చూసుకుంటే పటిష్టమైన ఆస్ట్రేలియా పసికూన స్కాట్లాండ్ పై విజయం సాధించడం నల్లేరు మీద నడకే. 

అయితే ఈ మ్యాచ్ మాకు కీలకం కాదని.. ఈ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకోమని ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. మా వల్ల ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే మాతో పాటు అన్ని జట్లకు కలిసి వస్తుందని.. ఇంగ్లాండ్ ప్రమాదకరమైన జట్లలో ఒకటని తర్వాత స్టేజ్ లో ఇంగ్లాండ్ ను ఎదుర్కోవాల్సి వస్తే కష్టమని హేజిల్‌వుడ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే . దీంతో ఇంగ్లాండ్ ను ఇంటికి పంపడానికి ఆసీస్ కావాలనే స్కాట్లాండ్ పై ఓడిపోతుందా అనే అనుమానం కలిగింది. తాజాగా ఈ విషయంపై ఆసీస్ పేస్ బౌలర్ కమ్మిన్స్ స్పందించాడు. 

జోష్ హేజిల్‌వుడ్ వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోవద్దని..  ఇంగ్లండ్‌ను టోర్నీ నుంచి వెళ్లగొట్టడానికి మేము ఎలాంటి మాయ చేయడానికి ప్రయత్నించట్లేదని కమ్మిన్స్ అన్నాడు. మీరు దేశం తరపున ఆడుతున్నప్పుడు మీ బెస్ట్ ఇవ్వాలని.. అలా చేయకపోతే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కమ్మిన్స్ చెప్పుకొచ్చాడు. టోర్నీలో మా గెలుపును కొనసాగిస్తామని.. స్కాట్లాండ్ మంచి క్రికెట్ ఆడుతుందని ఈ ఆసీస్ పేసర్ తెలిపాడు. 

గ్రూపు బి లో భాగంగా ఆడిన మూడు మూడు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్ ల్లో 5 పాయింట్లతో స్కాట్లాండ్ సూపర్ 8 కు దగ్గరలో ఉంది. నమీబియా, ఒమన్‌ జట్లు ఇప్పటికే ఎలిమినేట్‌ అయిపోయాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య పోటీ నడుస్తుంది. చివరి మ్యాచ్ లో నమీబియాతో ఇంగ్లాండ్ గెలిచి.. ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ ఓడిపోతే ఇంగ్లాండ్ సూపర్ 8 కు చేరుతుంది.