AUS vs PAK 2024: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్.. బౌన్సర్‌తో కమ్మిన్స్ దిమ్మ తిరిగే కౌంటర్

AUS vs PAK 2024: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్.. బౌన్సర్‌తో కమ్మిన్స్ దిమ్మ తిరిగే కౌంటర్

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య ప్రస్తుతం తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 19 ఓవర్లో కమ్మిన్స్ బౌలింగ్ చేస్తున్నాడు. తొలి మూడు బంతులకు మూడు సింగిల్స్ వచ్చాయి. నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. కమ్మిన్స్ వేసిన ఐదో బంతిని పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం డిఫెన్స్ ఆడాడు. ఆ వెంటనే కమ్మిన్స్ వైపు గులాం బ్యాట్ చూపిస్తూ కాస్త ఓవరాక్షన్ చేశాడు. అయితే ఆ తర్వాత బంతికే కమ్మిన్స్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 

చివరి బంతిని అద్భుతమైన బౌన్సర్ వేసి గులాం ను ఔట్ చేశాడు. అనూహ్యంగా మీదకు దూసుకొచ్చిన ఈ బౌన్సర్ దెబ్బకు పాక్ బ్యాటర్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఫలితంగా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 5 పరుగులకే గులాం పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ లో కమ్రాన్ గులాం అద్భుతంగా రాణించాడు. బాబర్ అజామ్  స్థానంలో వచ్చి ముల్తాన్ టెస్టులో సెంచరీ కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. 

ALSO READ : India A vs Australia A: ఆస్ట్రేలియా ఏ జట్టుతో మ్యాచ్.. భారత ఎ స్క్వాడ్ లో రాహుల్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలర్ స్టార్క్ తో పాటు మిగిలిన ఆస్ట్రేలియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. 44 పరుగులు చేసిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బౌలర్ నజీమ్ షా 40 పరుగులు చేసి పాక్ స్కోర్ ను 200 పరుగులు దాటించాడు. 37 పరుగులు చేసి బాబర్ అజామ్ పర్వాలేదనిపించాడు. 204 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి గెలుపు దిశగా పయనిస్తోంది.