ఇయ్యాల్టి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

  •     21న ఎదుర్కోలు, 22న కల్యాణం, 23న రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి 25 వరకు వారం రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో లైటింగ్, చలువ పందిళ్లు, మంచినీటి వసతితో పాటు ఆలయానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 

సోమవారం అర్చకులు స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణం, మృత్సంగ్రహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.  21న ఎదుర్కోలు, 22న తిరుకల్యాణం, 23న దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు.   25న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి.   బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో 25 వరకు ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం లాంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. 
 

also read : యాదాద్రి నుంచి అయోధ్యకు తరలిన భక్తులు

ముగిసిన అధ్యయనోత్సవాలు

పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు ఆదివారం ‘నూత్తందాది చాత్మరా’ పూజలతో పరిసమాప్తం అయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఉదయం ఆలయంలో స్వామివారికి నిత్యారాధనలు ముగిసిన తర్వాత స్వామివారికి ‘నూత్తందాది చాత్మరా’ పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహామూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రమేశ్​ బాబు, సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఉన్నారు.