![నయనానందకరంగా నారసింహుడి చక్రస్నానం](https://static.v6velugu.com/uploads/2025/02/patagutta-brahmotsavams-to-conclude-with-ashtottara-shataghatabhishekam-today_cmQGRyKH1E.jpg)
- నేడు అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్న పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామి అమ్మవార్లను ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. తర్వాత ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు చక్రస్నానం జరిపించారు.
లక్ష్మీనారసింహులను ప్రత్యేక వాహనంపై అధిష్ఠింపజేసి పాతగుట్టపైన ఉన్న పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు, తాము సైతం పుష్కరిణిలో స్నానం చేశారు. సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు ముగిసిన అనంతరం.. దేవతోద్వాసనం, పుష్పయాగం, ద్వాదశారాధన, డోలోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో భాస్కర్‌రావు, చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌శర్మ, ఏఈవోలు జూషెట్టి కృష్ణగౌడ్, గజవెల్లి రమేశ్‌బాబు, రఘు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేటితో బ్రహ్మోత్సవాలు ముగింపు
ఈ నెల 7న మొదలైన పాతగుట్ట నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఉదయం నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు. అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలికంగా రద్దయిన ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం వంటి కార్యక్రమాలను శుక్రవారం నుంచి తిరిగి కొనసాగించనున్నారు.