యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 19న స్వస్తివాచనం, పుణ్యాహవచనంతో మొదలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా అర్చకులు 108 కలశాలను వరుస క్రమంలో పేర్చి, ఫల, పుష్ప, రస, గంధ, జలానికి ప్రత్యేక పూజలు చేసి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.
అనంతరం అట్టి జలంతో స్వామిఅమ్మవార్లకు అభిషేకం చేశారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రమేశ్ బాబు, గట్టు శ్రావణ్ కుమార్, జూషెట్టి కృష్ణ గౌడ్, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్జిత సేవలు పునరుద్ధరణ
అధ్యయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 15 నుంచి తాత్కాలికంగా రద్దు చేయబడిన ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆదివారంతో ఉత్సవాలు ముగియడంతో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.