యాదగిరిగుట్ట, వెలుగు: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు కనులపండువగా జరిపించారు.
ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అనిత దంపతులు, యాదాద్రి టెంపుల్ తరఫున చైర్మన్ నర్సింహమూర్తి, ఈవో రామకృష్ణారావు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం నారసింహుడు శ్రీరామచంద్రుడి అవతారంలో హనుమంత వాహనంపై ఆలయ తిరువీధుల్లో విహరించి భక్తులను పరవశింపజేశారు.