
పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. 2014 ఎన్నికలలో రూ.2 కోట్ల ఆస్తిని అఫిడవిట్ లో చూపిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఇవాళ రూ.2 వేల కోట్లు ఎలా వచ్చాయో బహిరంగ చర్చకు రావాలని నందీశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో బీఆర్ఎస్ నేతలు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి.. ఆలయ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేశారని ఆరోపించారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గతంలో తాను పటాన్ చెరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. భూములను కబ్జా చేయడం తప్ప మహిపాల్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పాత్ర లేదన్నారు. ఆస్తులు కూడబెట్టి.. అందలం ఎక్కడం తప్ప ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లను కొనేందుకు మహిపాల్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పటాన్ చెరు నియోజకవర్గం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.