- తిరుమల వెళ్లి వస్తుండగా రైల్వే కోడూరు వద్ద ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు
సంగారెడ్డి, వెలుగు : కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో పటాన్‌చెరుకు చెందిన దంపతులు చనిపోగా, ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన సందీప్ షా (39) పటాన్‌చెరులోని సీతారాంకాలనీలో ఉంటూ రియల్ ఎస్టేట్‌తో పాటు క్రషర్స్ సప్లయింగ్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతడు మూడు రోజుల కింద భార్య అంజలీదేవి (33), ముగ్గురు పిల్లలతో కలిసి కారులో తిరుమలకు వెళ్లారు.
ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. రేణిగుంట – కడప హైవేపై రైల్వేకోడూరు వద్దకు రాగానే కారు.. ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో సందీప్‌షా, అంజలీదేవి అక్కడికక్కడే చనిపోయారు. పెద్దకూతురుకు తీవ్రగాయాలు కాగా, మరో కూతురు, కుమారుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. సందీప్‌షా దంపతుల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
యాక్సిడెంట్ విషయం తెలియగానే ఎమ్మెల్యే తన సోదరుడు మధుసూదన్‌రెడ్డిని ఘటనాస్థలానికి పంపించారు. తీవ్రంగా గాయపడిన పెద్ద కూతురుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి డాక్టర్లతో మాట్లాడారు. సందీప్‌షా మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు.