దోమడుగు గ్రామస్తుల నిరసన
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలని, రోడ్డు వేయించాలని డిమాండ్ చేస్తూ దోమడుగు గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకుని నిలదీశారు. దాంతో కోపానికొచ్చిన ఎమ్మెల్యే నా వెహికల్ నే అడ్డుకుంటారా.. మీ ఊరికి రోడ్డు వేయించేదే లేదంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ మహిళలు కొంతసేపు ఆందోళన చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్తుండగా దోమడుగు వద్ద మహిళలు అడ్డుకున్నారు.
ఎన్నికలప్పుడు తమ గ్రామానికి రోడ్డు వేస్తామని, స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, మూడేండ్ల నుంచి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేకు కాకుంటే తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. సర్పంచ్ అబిశెట్టి రాజశేఖర్ కు సమస్యలు చెప్పుకొన్నా పట్టించుకోలేదని విమర్శించారు. ఏడవ వార్డులో మెయిన్‌రోడ్డు చెడిపోయి అవస్థలు పడుతున్నామన్నారు. తమ సమస్య తీర్చకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్తామని హెచ్చరించారు. పోలీసులు మహిళలకు నచ్చచెప్పి పంపించారు.