కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై ఆమె పీఏ కమ్ డ్రైవర్ ఆకాశ్ స్టేట్మెంట్ ను పఠాన్ చెరు పోలీసులు రికార్డ్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చాడు ఆకాష్ . ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళామని చెప్పాడు. దర్గా నుండి హైదరాబాద్ చేరుకొని, లాస్య కార్లో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కార్లో ఎక్కించి తాము పటాన్ చెరు వైపు వెళ్లామని చెప్పాడు. ప్రమాదం సమయంలో తన మైండ్ బ్లాంక్ అయ్యిందని ఆకాష్ చెప్పాడు.
అయితే ముందు వెళ్తున్న వాహనం ఢీ కొట్టి కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ రేలింగ్ కి ఢీకొట్టారని పటాన్ చెరు డీఎస్పీ తెలిపారు. ప్రమాదం కంటే ముందే కారు ముందు పార్ట్స్ పగిలి కింద పడిపోయాయని చెప్పారు. నిర్లక్ష్యంగా, అతివేగంతో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
ఫిబ్రవరి 23 తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు దగ్గర ఔటర్ రింగ్ పై రెయిలింగ్ ను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు కావడంతో లాస్య నందిత స్పాట్ లోనే చనిపోయారు. ఆమె పీఏ కమ్ డ్రైవర్ ఆకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆకాశ్ ప్రస్తుతం మియాపూర్ లోని శ్రీకర్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు.