మరో వివాదంలో రాందేవ్ బాబా.. షర్బత్ జిహాద్ అంటూ కూల్ డ్రింక్స్పై సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో రాందేవ్ బాబా.. షర్బత్ జిహాద్ అంటూ కూల్ డ్రింక్స్పై సంచలన వ్యాఖ్యలు

ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే యోగా గురు రాందేవ్ బాబా మరో వివాదానికి తెరలేపారు. పతంజలి ప్రాడక్ట్స్ ప్రమోషన్ లో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్, ఓట్ జిహాద్ వ్యాఖ్యలను పోలినట్లుగానే ఈ సారి ‘షర్బత్ జిహాద్’ అనే సంచలన వ్యాఖ్యలు చేసి మరో చర్చకు తెరతీశారు. కూల్ డ్రింక్స్ పై.. ముఖ్యంగా ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించిన డ్రింక్స్ ను టార్గెట్ చేస్తూ.. తమ కంపెనీ ప్రాడక్ట్స్ కొనాల్సిందిగా ప్రమోషన్ వీడియోను తన అఫీషియల్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

‘షర్బత్ తాగితే ఆ డబ్బులతో మసీదులు, మదరసాలు నిర్మిస్తారు. అదే పతంజలీ తయారు చేసే గులబ్ షర్బత్ తాగితే గురుకులాలు, ఆచార్యకులం, పతంజలి యూనివర్సిటీ, భారతీయ శిక్షా బోర్డ్ నిర్మాణాలు జరుగుతాయి’’ అని సంచలన వీడియో రిలీజ్ చేశారు. సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో టాయిలెట్ క్లీనర్లను అమ్ముతున్నారని, వీటి నుంచి పిల్లలను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నట్లు చెప్పారు. వీడియో టైటిల్ ‘షర్బత్ జిహాద్’ అని పెట్టారు. 

అయితే ఈ వీడియోలో సదరు కంపెనీ పేరును ప్రస్తావించకపోయినా.. ‘హందార్ద్’ కంపెనీకి చెందిన ‘రూ అఫ్జా’ గురించే ఆయన మాట్లాడినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రజలు తాము ఏం తాగుతున్నామో తెలియక సాఫ్ట్ డ్రింక్స్ పేరున టాయిలెట్ క్లీనర్లను తీసుకుంటున్నారని ఈ వీడియోలో రాందేవ్ బాబా తీవ్ర విమర్శలు చేశారు. 

సోషల్ మీడియాలో రాందేవ్ బాబా చేసిన వీడియోకు పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు నిజమేనని సమర్ధిస్తున్నారు. మరి కొందరు పతంజలి ప్రాడక్ట్స్ అమ్ముకోవడానికి ఇలాంటి వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. Rooh Afza ని కాపీ కొట్టి పతంజలి షర్బత్ తీసుకొచ్చారని, దాన్ని అమ్ముకోవడానికి హిందూ-ముస్లిం సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.