- సర్కారు చేతికి పటౌడీ ఆస్తులు!..
- రూ.15 వేల కోట్ల ఆస్తులపై స్టే ఎత్తేసిన మహారాష్ట్ర హైకోర్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ నుంచి బయటకు రాగానే అతనికి మరో బ్యాడ్ న్యూస్ స్వాగతం పలికింది. పూర్వీకుల నుంచి సైఫ్ కు వారసత్వంగా వచ్చిన దాదాపు రూ.15 వేల కోట్ల ఆస్తి.. కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందనే పిటిషన్‌పై ఉన్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేసింది.
ఈ చర్యతో సైఫ్ అలీఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్ ఉస్ సాభా ప్యాలెస్, దారుస్సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్రాపర్టీ సహా భోపాల్‌లోని పటౌడీ కుటుంబానికి చెందిన దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులన్నీ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది.
ఆస్తుల వివాదంపై పటౌడీ కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా అప్పీలేట్ అథారిటీ ముందు హాజరై తమ వాదన వినిపించాలని జస్టిస్ వివేక్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ బెంచ్ 2024 డిసెంబర్ 13న ఆదేశించింది. కానీ నిర్ణీత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనను వినిపించలేదు.
కోర్టు ఇచ్చిన టైమ్‌లోగా ఎటువంటి దావా వేయలేదు. ఇప్పుడు తమ వారసత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉండడానికి.. డివిజన్ బెంచ్‌లో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గంగా కనిపిస్తున్నది.
అసలు కేసు ఏంటంటే..!
ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం.. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన వ్యక్తులకు భారత్‌లో ఆస్తులుంటే వాటిపై పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానిదే.1947 వరకు భోపాల్ రాచరిక రాష్ట్రంగా ఉంది.
నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆ రాష్ట్ర చివరి నవాబ్. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. నవాబ్ హమీదుల్లా ఆస్తికి చట్టబద్ధ వారసురాలు ఆయన పెద్ద కూతురు అబిదా కాగా.. ఆమె 1950లో పాక్‌కు వలస వెళ్లిపోయారు.
రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ భారత్ నే ఉండి నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ(సైఫ్ అలీఖాన్ తాత)ని పెండ్లి చేసుకున్నారు. దాంతో ఆమె తన తండ్రి ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలు అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ఈ ఆస్తులలో కొంత భాగాన్ని వారసత్వంగా పొందాడు.
అయితే, అబిదా సుల్తాన్ వలస వెళ్లడం వల్ల ఆ ప్రాపర్టీని.. ఎనిమీ ప్రాపర్టీగా తేల్చి జప్తు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అందులో భాగంగానే ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్.. భోపాల్ నవాబ్ భూమిని కేంద్ర ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది.
పటౌడీ కుటుంబానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నోటీసును సైఫ్ అలీఖాన్ సవాలు చేసి ఆస్తి కేంద్రానికి దక్కకుండా స్టే తీసుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం వారి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.
ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీఖాన్ థ్యాంక్స్
కత్తిపోట్లతో ఉన్న తనను ఆస్పత్రికి చేర్చిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను సైఫ్ అలీ ఖాన్ కలిశాడు. అతడిని కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఆస్పత్రిలో ఉన్నపుడే భజన్ సింగ్ ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా సైఫ్ భావోద్వేగానికి గురయ్యాడు.
సైఫ్ తనకు కొంత డబ్బు కూడా ఇచ్చాడని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా చేస్తానని తనకు హామీ ఇచ్చాడని డ్రైవర్ చెప్పారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌తో సైఫ్ అలీఖాన్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.