- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో గెలిచిన మంత్రి జగదీశ్ రెడ్డికి ఈ సారి డిపాజిట్ కూడా దక్కదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి విమర్శించారు. మంగళవారంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. జగదీశ్ రెడ్డి ఓడిపోతారని తెలిసే మంత్రి కేటీఆర్ ఎంపీ కోమటిరెడ్డిపై అర్థంలేని ఆరోపణ చేశారని మండిపడ్డారు. జగదీశ్ రెడ్డికి దమ్ముంటే కోమటిరెడ్డిపై కాదు తనపై నిలబడి గెలవాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసి నిరాహారదీక్ష చేసిన కోమటిరెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్డి పదవుల కోసం పంపకాల కోసం రాజకీయాలు చేసే నేతలని విమర్శించారు.
ప్రగతి నివేదన సభలో మొక్కుబడిగా దళితబంధు చెక్కులు ఇచ్చారని, సూర్యాపేటలోని దళిత కుటుంబాలకు ఈ పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధు, గృహలక్ష్మి పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే బీఆర్‌ఎస్ నాయకుల 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మంత్రి చుట్టూ ఉన్న నాయకులే మంత్రికి ఓటు వేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగదీశ్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.