షారుఖ్ ఖాన్ ను చాలారోజుల తర్వాత వెండి తెరపై చూడబోతున్నాం. ‘పఠాన్’ సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆయన మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మరో సర్ ప్రైజ్ న్యూస్ వచ్చింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన ‘పఠాన్’ ట్రైలర్ జనవరి 10న రానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పఠాన్ ట్రైలర్ 2 నిమిషాల 37 సెకన్ల నిడివితో ఉంటుందని అంచనా. ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కింగ్ ఖాన్, జాన్ అబ్రహం మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయని బాలీవుడ్ టాక్. షారుఖ్ ఖాన్‌ను మునుపెన్నడూ చూడని యాక్షన్ లో చూస్తారని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది.
భారీ యాక్షన్ చిత్రంగా రూపొందిన ‘పఠాన్’ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. షారుఖ్ విషయానికి వస్తే.. వెండి తెరకు ఇతను చాలానే గ్యాప్ ఇచ్చాడని చెప్పొచ్చు. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమా చేయాలని అనుకున్నా.. వివిధ కారణాల వల్ల వీలు కాలేదు. అనంతరం ఏకంగా వివిధ సినిమాలకు ఓకే చెప్పేశారు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ ఫిల్మ్ లో షారుఖ్ డ్యూయల్ రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. రాజ్ కుమార్ హిరాణీతో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో షారుఖ్ ఫుల్ బిజీగా మారిపోయారు.