కనులపండువగా నారసింహుడి కల్యాణం

కనులపండువగా నారసింహుడి కల్యాణం
  • ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్‌‌‌‌
  • ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై విహరించిన యాదగిరీశుడు
  • కల్యాణానికి భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
  • నేడు రాత్రి దివ్యవిమాన రథోత్సవం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తిరుకల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం సుమారు రెండు గంటల పాటు సాగింది. స్వామివారిని పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి గజవాహనంపై ఊరేగిస్తూ కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. 

అనంతరం కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్‌‌‌‌ హనుమంతరావు, యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున చైర్మన్‌‌‌‌ నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌‌‌‌రావు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అనంతరం మహామంత్ర పుష్పపఠనం, చతుర్విద పారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ మాంగల్యధారణ తంతును పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు, వేదపండితుల కలిసి తలంబ్రాల వేడుకను జరిపించారు. 

స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ‘నమో నారసింహ.. జై నారసింహ.. గోవిందా’ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. లోక కల్యాణం కోసం స్వామి అమ్మవార్ల కల్యాణం జరుపుతారని అర్చకులు తెలిపారు. లక్ష్మీనారసింహుల కల్యాణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అనిత దంపతులు పాల్గొని, వ్యక్తిగతంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. 

అంతకుముందు బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం నారసింహుడు శ్రీరామచంద్రుడి అవతారంలో హనుమంత వాహనంపై విహరించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

నేడు దివ్యవిమాన రథోత్సవం

పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం గరుడ వాహనంపై స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించి, సాయంత్రం 5 గంటలకు రథాంగ హోమం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభిస్తారు.