రోడ్డు ప్రమాదం… రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. తాగుబోతు ఢ్రైవర్ నిర్లక్ష్యం… ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నారి ఆడకూతుళ్ల బతుకుల్ని బుగ్గిచేసింది. వేసవి సెలవుల సంబురం… ఓ ఇంటికి పెద్దదిక్కును కోల్పోయేలా చేసింది. ఇవాళ వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలిసినవారందరినీ కంటతడి పెట్టించింది.
చెన్నరావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన అనిల్… వేసవి సెలవుల్లో తన కూతురును తీసుకుని గీసుకొండ మండలం పోతరాజుపల్లిఉంటున్న తన చెల్లెలి ఇంటికి వెళ్లాడు. రిటర్న్ జర్నీలో.. తన చెల్లెలి ఇద్దరు కూతుళ్లను కూడా తీసుకుని జల్లికి వస్తుండగా.. కొమ్మాలలో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను … ఎదురుగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. బైక్ పై నుంచి అనిల్ తో పాటు.. ముగ్గురు పిల్లలు ఎగిరిపడ్డారు. ఇద్దరు పాపలు, అనిల్ అక్కడికక్కడే చనిపోయారు. కొనప్రాణంతో ఉన్న అనిల్ కూతురును వరంగల్ ఎంజీఎం తీసుకుపోయారు. అక్కడ ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది.
ఈ యాక్సిటెండ్ చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్నవారు.. రోడ్డుపై వెళ్తున్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. స్విఫ్ట్ కారు వేగంగా రావడం… ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించుకున్న స్థానికులు కారు డ్రైవర్ ను బయటకు లాగారు. కోపంతో దాడిచేశారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. అమాయక పిల్లల ప్రాణాలు తీశావు కదరా అంటూ కొట్టారు. పోలీసులకు అప్పగించారు.
ఈ ఘోర ప్రమాదం.. అన్నాచెల్లెల్లయిన రెండు కుటుంబాల్లోనే కాదు… గీసుకొండ మండలంలోనూ విషాదం నింపింది.