
మెదక్, పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్లోచేరారు. శుక్రవారం యూసుఫ్ పేటలోని ఆయన ఇంటి వద్ద ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి శశిధర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మెదక్ పట్టణంలో డీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు ఇంటికి వెళ్లిన ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిరెడ్డి, శశిధర్‌రెడ్డి, ఆంజనేయులు చేరికతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అయిందని, ఇక పద్మా దేవేందర్‌రెడ్డి విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హైకమాండ్‌కు చెవులే కాని, కళ్లులేవని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, ఏడుపాయల చైర్మెన్ బాలాగౌడ్, గడీల శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, వైస్ చైర్మెన్ మల్లికార్జున్ గౌడ్, ఏఎంసీ చైర్మెన్ జగపతి పాల్గొన్నారు.