లేడి డాక్టర్ పై పేషంట్ దాడి.. అంతా చూస్తుండగానే...

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా డాక్టర్ పై పేషేంట్ దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది.స్విమ్స్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా డాక్టర్‌ పై ఓ రోగి దాడి చేసే గాయపరిచిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ చేస్తున్న ఓ మహిళా డాక్టర్ పై అక్కడే డిహైడ్రేషన్‌ సెంటర్లో చికిత్స పొందుతున్న ఓ మానసిక రోగి హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి వైద్యురాలు జుట్టు పట్టుకొని, పక్కనే ఉన్న టేబుల్‌ కేసి బాదాడు.ఈ ఘటనలో వైద్యురాలి తలకి తీవ్ర గాయమయ్యింది. తలకు గాయమవ్వటంతో రక్తస్రావమైంది, పక్కనే ఉన్న వైద్యులు సిబ్బంది అప్రమత్తమై వెంటనే రోగిని పట్టుకుని, ఆమెను అతని నుండి విడిపించారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్లు స్విమ్స్‌, శ్రీ పద్మావతి మహిళా కళాశాల వైద్యశాలలో విధులు బహిష్కరించి, అత్యవసర విభాగానికి చేరుకొని ధర్నా చేపట్టారు. కోల్‌కత్తా జీఆర్‌ కార్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యురాలిపై జరిగిన ఘటనకు నిరసనగా స్విమ్స్‌, రుయా ఆసుపత్రి జూనియర్‌ వైద్యులు 12 రోజులు పాటు నిరసన వ్యక్తం చేసి, శుక్రవారం విరామం ప్రకటించారు. ఆ మరుసటి రోజే స్విమ్స్‌లో ఈ ఘటనతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మానసిక రోగులు, బీపీ రోగులు, ఇతర రోగుల మధ్య తాము నిరంతరం విధులు నిర్వహించాలని, వారి పరిస్థితి సరిగా లేదని చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే, ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు డాక్టర్లు.