- డ్యూటీ నర్సులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన
మహబూబ్ నగర్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. దామరగిద్ద మండలం కందన్ పల్లికి చెందిన నారమ్మ(32) తీవ్ర జ్వరంతో బాధపడుతూ మేనల్లుడు నరేశ్సాయంతో సోమవారం సాయంత్రం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. మంగళవారం ఉదయం ఆమె వాష్ రూమ్ కి వెళ్లి అరగంట దాటినా తిరిగి రాలేదు. దీంతో అనుమానించిన మేనల్లుడు వెళ్లి చూడగా ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది.
వెంటనే ఆస్పత్రి సిబ్బందికి చెప్పగా.. పేషెంట్ ను కిందికి దింపి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. కాగా.. అదేరోజు రాత్రి డ్యూటీ నర్సులు వైద్య సేవలు అందించే సమయంలో నారమ్మను తిట్టడడంతోనే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టూ టౌన్ పోలీసులు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు. బంధువులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.