సర్వర్ డౌన్‌తో సమస్యలు రోజుల కొద్దీ తిరగాల్సి వస్తోందంటున్న పేషెంట్లు
సూర్యాపేట, వెలుగు : బెడ్ల కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సూర్యాపేట జిల్లాకు చెందిన డయాలసిస్ పేషెంట్లకు తాజాగా కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చిన టైంలో ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం, సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో రోజంతా సెంటర్‌లోనే పడిగాపులు పడాల్సి వస్తోంది. రోజంతా ఎదురుచూసినా సమస్య పరిష్కారం కాకుండా డయాలసిస్ కోసం మరో రోజు రావాల్సి వస్తోంది. దీంతో పేషెంట్లు సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రోజంతా వృథా...
సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు హుజూర్‌నగర్‌లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సూర్యాపేట సెంటర్ పరిధిలో 57 మంది, హుజూర్‌నగర్ పరిధిలో 60 మంది పేషెంట్లు ఉన్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు గతంలో బయోమెట్రిక్ సిస్టమ్ ఉండగా కరోనా టైం నుంచి దానిని తీసివేశారు. అయితే తాజాగా మళ్లీ ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో పేషెంట్లకు కష్టాలు మొదలయ్యాయి. పేషెంట్లు వచ్చిన టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వేలి ముద్రలు పడకపోవడంతో పాటు, సర్వర్ కనెక్ట్ అవడం లేదు. దీంతో కొందరు వేలి ముద్రలు పడే వరకు వేచి ఉంటుండగా, మరికొందరికి ఎంత సేపు చూసినా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో ఆ పేషెంట్లు మరోరోజు రావాల్సి వస్తోంది. ఒక్కోసారి ట్రీట్‌మెంట్‌కు ముందు ఫింగర్ ప్రింట్స్ పడినా, ట్రీట్‌మెంట్ ముగిసిన తర్వాత వేలిముద్రలు పడకపోవడంతో పేషెంట్లు సెంటర్ వద్దే పడిగాపులు పడుతున్నారు. దీంతో ఒక్కసారి డయాలసిస్ చేయించుకునేందుకు రోజంతా వృథా అవుతుందని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పింఛన్ల కోసం ఆధార్ అప్‌డేట్ చేస్తుండడం వల్ల సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, మరికొన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని సిబ్బంది చెబుతున్నారు.
వేలి ముద్రలు పడక ఇబ్బందులు
హుజూర్‌నగర్ సెంటర్‌లో నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నా. ఈ మధ్య బయోమెట్రిక్ ప్రవేశపెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మా షిఫ్ట్ టైంకు వేలిముద్రలు పడకపోవడం, సర్వర్ పనిచేయకపోవడంతో గంటల తరబడి, ఒక్కోసారి రోజుల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. బయోమెట్రిక్ విధానాన్ని తీసివేయాలి.
– బత్తిని వెంకటేశ్వర్లు, హుజూర్‌నగర్