- ఎలుకల కోసం పాములు
- బెడ్ల దగ్గరికి రావడంతో వణుకుతున్న పేషెంట్లు
వరంగల్, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎంలో ఇన్నాళ్లూ ఎలుకలు మాత్రమే తిరుగుతుండగా, ఇప్పుడు వాటి కోసం పాములు వస్తున్నాయి. గడిచిన రెండు వారాల్లో ఏకంగా మూడు నాగుపాములు రావడం, వార్డుల్లో పేషెంట్లు పడుకున్న బెడ్ల కిందే ప్రత్యక్షమవుతుండడంతో పేషెంట్లు, వారి బంధువులు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎలుకలు కొరికి ఓ పేషెంట్ ప్రాణాలు కోల్పోగా కొత్తగా పాముల వల్ల ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
గమనించకపోతే కరిచేదే..
ఎంజీఎంలో ఎప్పట్లాగే ఎలుకలు తిరుగుతుండగా, వాటి కోసం ఇప్పుడు పాములు వస్తున్నాయి. రెండు వారాల్లో 3నాగుపాములు హాస్పిటల్ వార్డుల్లోకి వచ్చాయి. అక్టోబర్ 2న హాస్పిటల్ ఆవరణలో జనాలతో రద్దీగా ఉండే గాంధీ విగ్రహం వద్ద ఓ నాగుపాము కనిపించడంతో సెక్యూరిటీ దానిని చంపేశారు. 10 రోజుల క్రితం ఫీవర్ వార్డులోని బాత్రూంలోకి నాగుపాము వచ్చింది. ఆదివారం ఏకంగా న్యూరో మెడికల్ వార్డులోని మంచాల వద్ద ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా పేషెంట్లు, వారి అటెండెంట్లు పరుగులు పెట్టారు. అక్కడున్న సిబ్బంది పామును చంపేశారు. రెండు వారాల్లో ఏకంగా మూడు నాగుపాములు రావడంతో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న మొదలైంది. ఆసుపత్రి పరిసరాలు చిత్తడిగా ఉండడంతో అక్కడ తావు పెట్టి, ఎలుకల కోసం వార్డుల్లోకి వస్తాయని భావిస్తున్నారు. ఆదివారం అటెండెంట్లు గమనించకపోతే బెడ్‌పై ఉన్న పేషెంట్‌ను కరిచేదని అంటున్నారు. అప్పట్లో ఎలుక కరిచిన ఘటన తర్వాత ఎలుకలను పట్టేందుకు వారం పాటు హడావిడి చేసిన ఆఫీసర్లు, ఇప్పుడు ఎలుకలను, వాటి కోసం వచ్చే పాములను కూడా వేటాడాల్సిన పరిస్థితి వచ్చింది.
అప్పట్లో సంచలనం
గతంలో ఎంజీఎంలోని ఆర్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న శ్రీనివాసచారి అనే పేషెంట్ ఎలుకల దాడిలో చనిపోయాడు. తీవ్ర అనారోగ్యానికి తోడు ఎలుకలు కొరకడంతో రాత్రంతా రక్తం పోయింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఇదే తరహాలో పేషెంట్ల బెడ్ల వద్ద ఎలుకలు తిరుగుతుండడంతో బాధితులను చూసేందుకు వచ్చినవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.