తెలంగాణాలో హైడ్రా కూల్చివేతల పరంపర నడుస్తోంది. చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. చెరువుల అక్రమణను సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆక్రమణకు పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలేది లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలో ఇటీవలే తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ పై కూడా గత కొంతకాలంగా ఆరోపణలొస్తున్నాయి.
Also Read:-ఫ్రీగా కూరగాయలు.. ఎగబడ్డ జనం.. ఎక్కడంటే..
తన ఫామ్ హౌస్ పై ఆరోపణలొస్తున్న క్రమంలో స్పందించారు పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ రూల్స్ కి విరుద్ధంగా ఉంటే తానే దగ్గరుండి కూల్చేస్తానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తీసుకొనే నిర్మించామని అన్నారు. తాను ఆక్రమించి కట్టినట్టు నిరూపిస్తే కేటీఆర్ వచ్చి అక్రమ కట్టడాలు కూల్చుకోవచ్చని అన్నారు.కేటీఆర్ తెలియక నాపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
చెరువులు అక్రమించినవాళ్లపై చర్యలు తీసుకోవటాన్ని సమర్థిస్తున్నానని అన్నారు. కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, ఆరోపణలు చేస్తున్న భూమి పట్టా భూమి అని అన్నారు.ఆ భూమి ధరణిలో తన కుమారుడు పేరు పై ఉందని అన్నారు. తనకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తాను కట్టింది అక్రమమని తేల్చి నోటీసులు ఇస్తే, ఆరోజే వెళ్లి కూల్చేస్తానని అన్నారు. గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్ గూడ లో 14.14 గుంటల భూమిని 1999లో భూమిని కొనుగోలు చేశానని, పట్టా ల్యాండ్ తీసుకొని మామిడి తోట, వరి సాగు చేస్తున్నానని అన్నారు. హంగులు, ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నానని అన్నారు మహేందర్ రెడ్డి.