
చేవెళ్ల, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను బీఆర్ఎస్ కంచుకోటగా మారుస్తామని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల పట్ణణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. మహేందర్ రెడ్డితో పాటు చేవెళ్ల సెగ్మెంట్ ఇన్ చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. షాబాద్ చౌరస్తా నుంచి పటాకుల మోతలు, డప్పు చప్పుళ్లతో కాలె యాదయ్య భారీ ర్యాలీగా నామినేషన్ వేయడానికి ప్రచార రథంపై వెళ్లారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యాదయ్యను మూడోసారి గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎలాంటి వారో ఒకసారి ఆలోచించాలన్నారు. పాల లాంటి మనసు ఉన్న యాదయ్య కావాల్నా.. ఆయుధాలు సరఫరా చేసే క్రిమినల్స్ కావాలో జనం తేల్చుకోవాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య మాట్లాడుతూ.. ఊసరవెల్లి లాంటి నాయకులకు ఓటేస్తే చేవెళ్ల ఆగమైతదన్నారు. అనంతరం చేవెళ్లలోని ఆర్వో సెంటర్లో ఆయన తన నామినేషన్ పేపర్లను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు మొయినాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కాలె యాదయ్య పూజలు చేశారు.
ఆయన వెంట చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మెంబర్ మాలతి, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్య శంకర్, మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్ రాజు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.