కలెక్టర్‌పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

వికారాబాద్ కలెక్టర్ దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్ పై లగచర్ల గ్రామస్తుల చేసిన దాడి వెనుక ఆయన కుట్ర పన్నినట్లు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న BRS నేత సురేశ్ ఆరోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. బోగమోని సురేష్ ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఫార్మా సిటీ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్, ప్రభుత్వ అధికారులపై కొందరు దుండగులు మూకుముడిగా దాడి చేశారు.