భూసేకరణకు ఎవరొచ్చినా తరిమికొడదాం : పట్నం నరేందర్​రెడ్డి

భూసేకరణకు ఎవరొచ్చినా తరిమికొడదాం : పట్నం నరేందర్​రెడ్డి
  • బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్,హరీశ్​రావు​ అండగా ఉంటరు 
  • మీటింగ్​లో కేటీఆర్​తోని కూడా మాట్లాడినా 
  • కలెక్టర్​పై దాడికి రెండు రోజుల ముందు రోటిబండ తాండాలో  ‘పట్నం’ వ్యాఖ్యలు
  • సోషల్​ మీడియాలో వీడియో వైరల్​

కొడంగల్, వెలుగు: ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం ఎవరొచ్చినా తరిమికొడదామని, బీఆర్​ఎస్​​పార్టీతోపాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు  అండగా ఉంటారని కొడంగల్ ​మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి వ్యాఖ్యానించారు.  వికారాబాద్​ కలెక్టర్​పై దాడికి రెండు రోజుల ముందు రోటిబండ తండాలో ఆయన రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఈ నెల 11న కలెక్టర్​ప్రతీక్​ జైన్​పై దాడి జరగ్గా.. గత నెల 27వ తేదీనే వికారాబాద్ ​జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండ తండాలో పట్నం నరేంద్​రెడ్డి ఈ వ్యాఖ్య లు చేసినట్టు తెలిసింది. అక్టోబర్​25న దుద్యాల మండలంలోని లగచర్లలో అధికారులు అభిప్రాయ సేకరణకు వెళ్లారు. అదే టైంలో లగచర్లకు చెందిన దుద్యాల మండల కాంగ్రెస్​ పార్టీ  ప్రెసిడెంట్​ శేఖర్​వెళ్తుండగా.. రోటిబండ తండావాసులు ఆయనను బంధించారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు.

దీంతో 27వ తేదీన తండావాసులను పరామర్శించడానికి రోటిబండతాండాకు పట్నం నరేందర్​రెడ్డి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘‘గ్రామానికి కాంగ్రెస్​నాయకులు, సీఎం, కలెక్టర్.. ఎవ్వరొచ్చినా తరిమికొడ్దాం. బీఆర్ఎస్ ​పార్టీ మనకు అండగా ఉంటది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు కూడా అండగా ఉంటరు. నిన్ననే కేటీఆర్​తోని మీటింగ్​ పెట్టి మాట్లా డినా’’ అంటూ పట్నం నరేందర్​ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు.

ప్రస్తుతం నరేందర్​ రెడ్డి  కలెక్టర్​పై దాడి కేసులో ఏ1గా చర్లపల్లి జైలులో రిమాండ్​లో  ఉన్నారు. కాగా, వీడియోలో వ్యాఖ్యలను బట్టి కలెక్టర్​ ప్రతీక్​ జైన్​, అడిషనల్​కలెక్టర్​ లింగ్యా నాయక్, తాండూర్​సబ్​కలెక్టర్​ఉమాశంకర్​ ప్రసాద్​, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్​రెడ్డి తదితరులపై దాడి చేయాలని 15 రోజుల ముందే ప్లాన్​ వేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేశ్, మరికొంత మందిని ఎంచుకుని ప్లాన్​ ఇంప్లిమెంట్​ చేసినట్టు విచారణలో వెల్లడైంది. భూసేకరణలో భూమి పోనివారే అధికారులపై దాడికి పాల్పడడం చూస్తుంటే పట్నం, మరికొందరు ముఖ్య లీడర్ల ప్లాన్​ ప్రకారమే ఇదంతా జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.