‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతమైంది. తాను జీవనోపాధి కోసం నడుపుతున్న టీ స్టాల్‌ను పాట్నా మున్సిపల్ అధికారులు తీసేయడంతో వెక్కివెక్కి ఏడ్చింది. ఈ అంశం మీడియాలోనూ వైరల్ అయింది. తనకు సాయం చేయాలంటూ ప్రియాంకా గుప్తా.. నేరుగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లను కలిశారు. దీంతో వారు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తేజస్వి యాదవ్ ఆదేశాల మేరకు ప్రియాంకా గుప్తా టీ స్టాల్ ను మున్సిపల్ అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంపై ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ సంతోషం వ్యక్తం చేసింది.
ఎవరీ చాయ్ వాలీ ?
బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అయితే నెలల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె టీ షాప్ పెట్టాలని నిర్ణయించుకుంది.‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ పేరిట పాట్నా బోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ టీ స్టాల్ ఫేమస్ అయింది. దీనికి ఎంతగా పాపులారిటీ వచ్చిందంటే.. లైగర్ హీరో విజయ్ దేవరకొండ, భోజ్‌పురి సినీ నటి అక్షర సింగ్ ఈ స్టాల్‌ని సందర్శించారు. స్టాల్ ముందు నిలబడి టీ తాగారు.
ఎందుకు తొలగించారు ?
రోడ్డు ఆక్రమణల తొలగింపులో భాగంగా పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రియాంకకు తొలుత నోటీసులు ఇచ్చారు. స్టాల్ ను తొలగించవద్దని ఆమె అధికారులను వేడుకుంది. దీనికి సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయింది. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ వద్ద డబ్బును డిపాజిట్ చేసి, తన దుకాణాన్ని తిరిగి తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని అధికారులను ఆమె కోరింది. అయిప్పటికీ వినకుండా అధికారులు.. ఆమె స్టాల్ ను తొలగించారు. ఈ క్రమంలో తనకు సాయం చేయాలంటూ లాలూ, తేజస్వి యాదవ్ లను ప్రియాంక కోరింది. తర్వాతి రోజే టీస్టాల్ ను పురుద్ధరించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. టీ స్టాల్ తో తాను నెలకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నానని ప్రజలు అంటున్నారని, దాని నిర్వహణకు అంతే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయని ప్రియాంక గుర్తు చేసింది. మార్కెట్ పడిపోయినందున తాను అంతగా సంపాదించడం లేదని తెలిపింది.