న్యూఢిల్లీ: ఎల్ఏసీ వెంట మళ్లీ పెట్రోలింగ్ ప్రారంభించేందుకు ఇండియా, చైనా అంగీకరించాయని విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. గత కొన్ని వారాలుగా ఇండియా, చైనా దౌత్య, సైనిక అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బలగాల ఉపసంహరణ, బార్డర్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్టోబర్ 22, 23న రష్యాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.
ఈ టూర్కు సంబంధించిన వివరాలను ఆయన సోమవారం మీడియాకు వెల్లడిస్తూ.. ఇండియా, చైనా మధ్య జరిగిన ఒప్పందం గురించి వివరించారు. ‘‘ఇండియా, చైనా మధ్య ఇదొక పాజిటివ్ డెవలప్మెంట్. బలగాల ఉపసంహరణ జరిగి.. పెట్రోలింగ్ మొదలైతే బార్డర్లో శాంతి ఏర్పాటవుతుంది. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో 2020లో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నప్పటి నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి ఘర్షణలో 20 మంది ఇండియా సైనికులు అమరులయ్యారు. చైనా వైపు నుంచి కూడా పలువురు సైనికులు చనిపోయారు’’ అని మిస్రీ గుర్తు చేశారు.