పోడు భూములకు పట్టాలియ్యాలె

గిరిజనులకు బతుకమ్మ చీరలు కాదు.. బతుకు దెరువు కావాలి. గిరిజనులు సాగు చేసుకుంటున్న తాత ముత్తాతల నాటి పోడు భూములకు పట్టాలు ఇయ్యాలె. హరిత హారం పేరు మీద గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ జైలులో పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నరు. సీఎం కేసీఆర్​కు గిరిజనులపై ప్రేమ ఉంటే ఇట్లనే చేస్తరా? మొన్న చిరంజీవి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటిస్తే.. ఈయన జాగీరు లెక్క 200 ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ సిటీకి ఇస్తానని హామీ ఇచ్చేసిండు. ఇది దొరల పాలన కాదా? అప్పట్లో ఇందిరా గాంధీ గిరిజనులకు భూములు ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టడం, బ్యాంకులను జాతీయం చేయడం లాంటి పనుల చేసి, వాటిలో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించింది. దొరల పిల్లలు, దేశ్ ముఖ్ ల పిల్లలు చదివే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి చోట్ల రిజర్వేషన్లు ఇచ్చి మా పిల్లలు చదువుకునే అవకాశం కల్పించింది. రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి హాస్టల్ లో ఉండి చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగేందుకు సాయపడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మళ్లా నిజాం కాలం కంటే దారుణంగా తయారయ్యాయి. బంగారు తెలంగాణ చేస్తమన్న సీఎం కేసీఆర్​ బికారి తెలంగాణ చేసిండు.

బికార్లుగా మార్చారు

‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక గిరిజనుల బతుకులు బాగు పడతయ్. మీరు ఎప్పుడూ ఉద్యోగాలు అడుగుతుంటరు. కానీ మీరే ఉద్యోగాలు ఇచ్చేలా తయారు చేస్త. మిమ్మల్ని టాటా,  బిర్లాలుగ చేస్త’ అంటూ సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పారు. టాటా, బిర్లా కాదు కదా.. సూటూ బూటూ వేసుకోనేలా కూడా చేయలేకపోయారు. చివరికి బికార్లుగా మార్చారు. దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అబద్ధపు మాటలు చెప్పే ముఖ్యమంత్రిని మనం చూడలేం. తెలంగాణ అన్నింట్ల నంబర్ వన్ అని చెప్పిన కేసీఆర్ గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలను మోసం చేసుడులోనూ నంబర్ వన్ గా చేసిండు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నంక దళితుడు సీఎం అయితడు అని నమ్మబలికి చివరికి ఆయనే ఆ పదవిలో కూసుండు. ‘కమీషన్లు దండుకో.. సొంత కుటుంబం జేబు నింపుకో’ అన్నరీతిలో పాలిస్తుండు. గిరిజనులకు మూడు ఎకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, ఇంటికో ఉద్యోగం, ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థుల కుటుంబాల్లో ఒకరికి సర్కారీ కొలువు.. ఇలా ఎన్నో మోసపు మాటలతో దొరల పాలన తలపించేలా పెత్తనం చేస్తుండు.

దేవుళ్లనీ మోసం చేసిండు

గిరిజనులనే కాదు.. గిరిజనుల దేవతలను కూడా మోసం చేసిండు మన సీఎం. సమ్మక–-సారక్క దేవతలను అబద్ధాలతో మోసగించిండు. మేడారాన్ని టూరిజం హబ్ గా మారుస్తానని, కేంద్రంతో కొట్లాడి.. దేశంలో అతి పెద్ద జాతర అయిన సమ్మక్క – సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకొస్తానని మాయమాటలు చెప్పిండు. భద్రాచలం రామయ్యను కూడా మోసం చేసిండు. భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని మండలి సాక్షి గా చెప్పి ఇగ మర్చిపోయిండు.  దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే. ఆయన పేరు అసలు కలవకుండ చంద్రశేఖర్ రావు అని పెడితే బాగుంటదేమో. ఎవరినీ కలవడు, ఎవరినీ కలవనీయకుండ చేస్తడు. లంబాడాలు -– గోండ్ల మధ్య, గొల్ల– కుర్మల మధ్య, బేస్తవాళ్లు –- ముదిరాజ్ ల మధ్య, మాల–-మాదిగల మధ్య.. ఇట్ల అనేక జాతుల మధ్య చిచ్చులు పెట్టి ఎవరిని కలవనీయకుండా చేస్తుండు.

గిరిజనుల బతుకులు మారాలంటే..

రూ.2 వేల పింఛన్లు,  రూ.5 వేల రైతు బంధు లాంటివి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేనే ఇస్తున్న అని చెప్పి సీఎం కేసీఆర్ జనాన్ని మోసం చేస్తున్నడు. మనం కట్టే పన్నుల వచ్చే పైసల నుంచి ఇస్తూ తన ఇంట్ల నుంచి ఇస్తున్నట్లు మాయ చేస్తుండు. పింఛన్లు, రైతుబంధులు కాదు.. మా గిరిజన బతుకులు బాగుపడాలంటే ఇంటికో ఉద్యోగం ఇయ్యాలే, రాష్ట్రంలోని తండాలు, గూడేలకు మౌలిక వసతులు కల్పించాలే. రోడ్లు వేయడం, మంచి నీరు సరఫరా చేయడం, సరైన వైద్యం అందించడం లాంటివి చేయాలి. ఢిల్లీ ప్రభుత్వం లాగ బడుల్ని తీర్చిదిద్ది, దారిద్య రేఖకు దిగువన ఉన్న వాళ్లందరికీ ఉచిత విద్య అందేలా చూడాలి. కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్న హామీని నిలబెట్టుకోవాలి.

ఉద్యోగాలు భర్తీ చేస్తే గిరిజనుల కష్టాలు తీరుతయ్​

ఆరున్నరేండ్లలో ఒక్కసారైనా డీఎస్సీ ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తున్న కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లకే పరిమితమైండు. ఒక్క పోలీసు ఉద్యోగాలే భర్తీ చేసిండు. అదిగూడ తన రక్షణ కోసమే తప్ప మరేంకాదు. అనేక ప్రభుత్వ డిపార్ట్ మెంట్లలో లక్షల ఖాళీలుంటే ఇంత వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు. రిటైర్ అయిన వారి ప్లేస్ లో కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పేరిట కాలయాపన చేస్తూ చదువకుకున్న పిల్లల జీవితాలతో ఆడుకుంటుండు. ఆయన ఇంట్ల రాజకీయ ఉద్యోగాలు మాత్రం భర్తీ చేసుకుండు. ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తే గిరిజనులు, పేదల ఇండ్లలో కష్టాలు తీరుతయన్న సోయి లేదాయే. కనీసం దుబ్బాక ప్రజల తీర్పును గౌరవించి ఇప్పటికైనా తప్పులు దిద్దుకోవాలి. -రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ,  ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్.