హైదరాబాద్ సిటీలో MIM కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. వంద రూపాయలకు పని చేసేవాళ్లకు తన అడ్డాలో ఏంపని అంటూ పోలీసులపై బోలక్ పూర్ కార్పొరేటర్ రుబాబు చేసిన ఉదంతం మరువక ముందే.. మరో MIM కార్పొరేటర్ వీరంగం సృష్టించారు. పత్తర్ గట్టి కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ పోలీసులపై విరుచుకుపడ్డాడు. చార్మినార్ సమీప యునాని హాస్పిటల్ ముందు పార్కింగ్ విషయంలో... పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. 25 ఏండ్ల నుంచి ఇక్కడే పార్కింగ్ చేస్తున్నామని మీకు ఎవరు కంప్లైంట్ చేశారని పోలీసులకు ఎదురుతిరిగాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో గొడవ పడ్డారు. తమాషా చేస్తున్నావా అంటూ పత్తర్ గట్టి కార్పొరేటర్ దౌర్జన్యం చేశారు.
పార్కింగ్ విషయంపై యునాని ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఫోన్ చేశారు. హాస్పిటల్ ముందు జరిగిన గొడవకు సంబంధించి వివరించారు. ఫోన్ లో కూడా ఆయన దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. సూపరింటెండెంట్ స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఇలాగే నడుస్తోందని రూడ్ గా మాట్లాడారు.
రంజాన్ మాసంలో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రార్థనలు చేసేందుకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వాళ్లందరికీ పార్కింగ్‌ను యునాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి మాత్రం అలా చేయలేదు.యునాని వైద్యశాల గేట్లు మూసివేశారు. దీంతో మక్కా మసీదులో ప్రార్థనలకు వచ్చినవారంతా రోడ్లపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. దీంతో ఇటు కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి రావడం.. అటు పోలీసులు రావడంతో..వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసు పవర్ చూపిస్తామంటే ఇక్కడ నడవదు అంటూ ఎస్‌ఐకి కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.
ముషీరాబాద్ లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్ పూర్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసి ఉంచారు. దీంతో షాపును క్లోజ్ చేయాలని పోలీసులు చెప్పారు. అక్కడకు చేరుకున్న ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ రెచ్చిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అధికారులను ఆదేశించారు. కేటీఆర్ ట్వీట్‌తో నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం
ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్
రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత