రాష్ట్రంలో రిజర్వేషన్ల తీరు మారలే

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఏండ్లుగా యువత ఎదురు చూస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నామని ప్రకటనలు చేసిన టీఆర్‌‌‌‌ఎస్ సర్కారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఉద్యోగాలు వస్తాయా? రావా? అన్న నిరాశ, నిస్పృహలతో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి మన రాష్ట్రంలో నెలకొంది. యువతరంలో ఆత్మ స్థైర్యాన్ని  నింపి వాళ్లకు బతుకు మీద ధీమా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. ఇప్పటికైనా టెక్నికల్‌‌గా ఉన్న సమస్యలను తొలగించి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి. అందులో ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా అమలయ్యేలా తెలంగాణ సర్కారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన రిక్రూట్‌‌మెంట్లలో మహిళా కోటా అమలు సక్రమంగా జరగలేదు. దీనిపై కోర్టుల్లోనూ కేసులు నడుస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే లోపైనా దానిని సవరించాలి.

రిజర్వేషన్ అమలులో లోపం వల్ల నష్టం

చదువు, ఉద్యోగాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్ ఉంది. దీనిని హారిజాంటల్‌‌గా ఇంప్లిమెంట్ చేయాలని చట్టాలు, అనేక కోర్టు తీర్పులు చెబుతున్నాయి. కానీ తెలంగాణలో అలా జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో మినహా మొత్తం ఉద్యోగ నియామకాల్లో మహిళా కోటాను సమాంతరంగా అమలు చేయని కారణంగా వందలాది మంది మెరిట్ పొందిన పురుష నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా మెరిట్ పొందని మహిళా అభ్యర్థులు లబ్ధి పొందారు. మహిళా రిజర్వేషన్లు 33.33% సమాంతరంగా అమలు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధం.

రెండు రకాలుగా రిజర్వేషన్ల అమలు..

భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు తీర్పుల ఆధారంగా దేశంలో ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.  (1) నిలువు/సామాజిక (Vertical/Social), (2) సమాంతర/ప్రత్యేక (Horizontal/Special) రిజర్వేషన్లు. వర్టికల్ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వస్తారు. హారిజాంటల్ రిజర్వేషన్లలో మహిళా, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ల అభ్యర్థులు వస్తారు. ఇటీవల సుప్రీం కోర్టు వికలాంగుల రిజర్వేషన్లను కూడా వర్టికల్‌‌గా లెక్కించాలని ఆదేశించింది. కానీ ప్రత్యేక కోటా కింద కల్పించిన మహిళా రిజర్వేషన్లను కూడా తెలంగాణ సర్కారు వర్టికల్‌‌గా అమలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తోంది.

కోటా అమలుపై కోర్టు తీర్పులు..

సుప్రీం కోర్టు 1992 నుంచి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరాంచల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ మమ్తాబిషప్, అనురాగ్ పటేల్ వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేయాలో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 16(4) ద్వారా వర్టికల్ రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు, వారికి కేటాయించిన రిజర్వేషన్ పోస్టులకు పోటీ పడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ల కంటే అదనంగా ఈ వర్గాల అభ్యర్థులు విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించి, వారి సాధికారతకు తోడ్పడాలన్నది ఇక్కడ లక్ష్యం. ఆర్టికల్ 15(3) ద్వారా మహిళలకు 33.33 % హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే మహిళలు జనరల్ కేటగిరి పోస్టుల్లో లేదా వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఎంపికైనప్పటికీ, మొత్తం ఎంపికైన మహిళా అభ్యర్థుల సంఖ్య 33.33 శాతానికి మించకూడదన్నది నిబంధన ఇందులో స్పష్టంగా  ఉంది. ఇదే అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, జూనియర్ సివిల్ జడ్జీల నియామకాల కేసు కె.వెంకటేశ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ తీర్పులోనూ తేల్చి చెప్పింది.

ఉమ్మడి రాష్ట్రంలో పొరబాటు.. 

1997లో జీవో 65 ద్యారా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా,  స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్​మెన్, ఎన్సీసీ రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాల్లో అమలుపై 100 పాయింట్ల రోస్టరును నిర్ధారించి, అన్ని రిజర్వేషన్లు వర్టికల్‌‌గా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఆ పొరబాటును మన పాలకులు నేటికీ తెలంగాణలో కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే మెడికల్ సీట్ల భర్తీలో మాత్రం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు మహిళా, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్​మెన్, ఎన్సీసీ కోటాలను  హారిజాంటల్‌‌గానే అమలు చేస్తున్నాయి. ఉద్యోగ నియామకాల విషయంలో రిజర్వేషన్ల అమలు తీరులో జరుగుతున్న పొరబాటును గ్రహించి, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కారు 2016లో జీవోఎంఎస్ నంబర్ 40, 2018లో జీవోఎంఎస్ నంబర్ 63 జారీ చేయడం ద్వారా మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్‌‌గా అమలు చేస్తోంది.
 
                                                                      .....కోడెపాక కుమార స్వామి,రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం

తెలంగాణలోనూ మార్చాలె
ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం సాధించుకున్న తెలంగాణలో రిజర్వేషన్ల అమలులో ఉన్న లోపాల కారణంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఈ సమస్యపై పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. 24 ఏండ్ల క్రితం నాటి జీవోను నేటికీ సవరించకపోవడం వల్ల పలు రిక్రూట్‌‌మెంట్లకు సంబంధించి కోర్టుల్లో ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్‌‌గా అమలు పరిచే విధంగా ఉత్తర్వులను జారీ చేయాలి. తెలంగాణ ఏర్పడినంక జరిగిన నియామకాలను పునఃసమీక్షించి జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన పురుష మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.