Minor League Cricket: అమెరికాకు భారత క్రికెటర్: USA మైనర్ లీగ్ కోచ్‌గా ఐపీఎల్ సెంచరీ హీరో

Minor League Cricket: అమెరికాకు భారత క్రికెటర్: USA మైనర్ లీగ్ కోచ్‌గా ఐపీఎల్ సెంచరీ హీరో

అది 2011 ఐపీఎల్. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై మురళి విజయ్(74), బద్రినాథ్ (66),కెప్టెన్ ధోని (43) బ్యాట్ ఝళిపించడంతో.. నిర్ణీత ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్.. ఆదిలోనే షాక్ తగిలింది. గిల్ క్రిస్ట్, షాన్ మార్ష్ త్వరగానే పెవిలియన్ కి చేరారు. అసలే బలహీనంగా ఉన్న పంజాబ్ జట్టుకి ఇక ఓటమి తప్పదనుకున్నారంతా.  పంజాబ్ డగౌట్‌లో కూడా విజయం మీద ఎవరికి ఆశలు లేవు. 

ఆ దశలో వాల్తాటి చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఏ ఒక్క బౌలర్‌ని వదలకుండా బౌండరీల వరద పారించాడు. 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి జట్టుకి ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే అతను మ్యాచ్ విన్నర్‌గా మారిపోయారు. చెన్నై కెప్టెన్ ధోని చేత ప్రశంసలు అందుకున్నారు. అలా ఒక్క మ్యాచ్ తో మారుమ్రోగిపోయిన వాల్తాటి ప్రస్తుతం అమెరికాలో కోచ్ పదవికి ఎంపికయ్యాడు. యూఎస్ఏ లోని మైనర్ లీగ్ క్రికెట్‌లో సీటెల్ థండర్‌బోల్ట్స్‌కు ప్రధాన కోచ్‌గా అధికారికంగా ప్రకటించారు. 2011 ఐపీఎల్ సీజన్ లో సెంచరీతో మెరిసిన వాల్తాటి 2023లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

ALSO READ | NZ vs SL 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్.. కారణం ఏంటంటే..?

పాల్ వాల్తాటీ సీటెల్‌లోని థండర్‌బోల్ట్స్ క్రికెట్ అకాడమీలో యువ క్రికెటర్లతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ముంబై, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అనుభవాన్ని కుర్రాళ్లతో పంచుకోవడం ఆనందంగా ఉందని వాల్తాటి అన్నాడు. మరోవైపు పాల్ వాల్తాటి మా  ప్రధాన కోచ్‌గా రావడం మాకు చాలా ఆనందంగా ఉందని మైనర్ లీగ్ క్రికెట్ జట్టు ఈ నెల ప్రారంభంలో ఒక ప్రకటనలో తెలిపింది.  వాల్తాటి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ఆడారు. 2011 ఐపీఎల్ సీజన్‌లో సెంచరీతో పాటు 14 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేసి ఒక్కసారి సంచలనంగా మారాడు. దేశవాళీ క్రికెట్ లో నాలుగు ఫస్ట్-క్లాస్, ఐదు లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు.