తెలంగాణ జనసైనికులు సిద్ధం కండి: పవన్ కళ్యాణ్

తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘‘త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలి’’ అని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ కు ఆయన సూచించారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలు వృథా అవుతాయన్నారు. పోరాటం చేసే ధైర్యం తనకు తెలంగాణ గడ్డ నుంచే వచ్చిందని పేర్కొన్నారు. ‘‘వేలాది మంది ఆత్మబలిదానం, త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది.. నాకు స్ఫూర్తినిచ్చే గడ్డ తెలంగాణ’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ‘‘ నాది ఆంధ్ర అనే భావన ఆంధ్రవాళ్లకు లేదు. దీనికి కారణం ఏపీలో చరిత్ర చెప్పేవాళ్లు లేరు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఏపీలో కొంతమందికి కోపం రావడం లేదు’’ అని పేర్కొన్నారు. ఏపీలోని మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

నిలబెట్టి తోలు వలుస్తా..

వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి ఇక యుద్ధమే అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని.. సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైసీపీ తాట తీస్తానని వెల్లడించారు. తప్పుడు మాటలు మాట్లాడితే నిలబెట్టి తోలు వలుస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.    

ఒంటి చేత్తో మెడ పిసికేస్తా..

‘వైసీపీ గూండాల్లారా ఒంటి చేత్తో మెడ పిసికేస్తా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కుదరదు.. నా కుటుంబాన్ని కూడా వదలలేదు. చట్ట ప్రకారం విడాకులు ఇచ్చి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ. 5 కోట్లు .. రెండో భార్యకు ఆస్తి రాసిచ్చా. రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. సిద్ధంగా ఉండండి. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో పర్యటించారా ? వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా కృషి చేస్తా. కార్మిక సంఘ నేతలు ముందుకు రావాలి. బీజేపీ, ప్రధాని అంటే గౌరవం ఉంది.. కానీ వాళ్లకు ఊడిగం చేయం. మంత్రులపై దాడులు జరిగాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వద్దకు నా బృందం వెళుతుంది. నేనేం లండన్ లో న్యూ యార్క్ లో పెరగలేదు’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.