హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వారి తరఫున ప్రచారం మాత్రం ఇంకా షురూ చేయలేదు. మరో 8 రోజుల్లో క్యాంపెయిన్ ముగియనున్నా.. ఆయన పర్యటన షెడ్యూల్ మాత్రం విడుదల కాలేదు. జనసేన పార్టీ అభ్యర్థులతో పాటు పొత్తుపెట్టుకున్న మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులు కూడా పవన్ క్యాంపెయిన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ సభలో పాల్గొన్న పవన్.. ఆ తర్వాత కనిపించలేదు. ఓవైపు జాతీయ పార్టీల నేతలు కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే వంటి వారు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి మోదీ ఇటీవల అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హాజరయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సీఎం కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ప్రచారంలోకి దిగక పోవడం గమనార్హం.