
అమరావతి, వెలుగు: జనసేన పార్టీ రాకతో రాజకీయాల్లో మార్పు మొదలైందని, అది అసెంబ్లీలో కనపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తమకు రాజకీయ బలం లేదని మాట్లాడేవాళ్లు లక్షల మంది యువత జనసేనతోనే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆదివారం జనసేన కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, ఆయా స్థానాల్లో విజయావకాశాలపై సమీక్షించారు. “ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందరూ ఆశతో వచ్చారు, ఆశయంతో ఎవరూ రాలేదు. ఎన్నికల్లో ఓటమి భయం లేదు. ఫలితాలు ఎలా ఉంటాయనే ఆందోళన అసల్లేదు. ఎన్ని సీట్లు వస్తాయన్న అంశంపై దృష్టి పెట్టలేదు. మార్పు కోసం ఎంత పోరాటం చేశామన్నదే ముఖ్యం. రాజకీయాల్లో కొత్త తరాన్ని తయారు చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచామన్న దానికంటే, ఎంత శాతం ఓటింగ్ వచ్చిందనే ముఖ్యం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్ధమవ్వాలి” అని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన బుక్ లెట్ ను పవన్ ఆవిష్కరించారు.