వంద నోటుపై నేతాజీ బొమ్మ వేయాలె

వంద నోటుపై నేతాజీ బొమ్మ వేయాలె

టోక్యోలో ఉన్న నేతాజీ అస్థికలను భారతదేశానికి తెప్పించే ప్రయత్నాలు చేయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేతాజీ కోసం కొత్తతరం కదలాలని పిలుపు ఇచ్చారు. ఎంతో మంది బలిదానాల వల్లే ఈరోజు దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను గౌరవించకుంటే మనం భారతీయులమే కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకోజి ఆలయంలో దిక్కులేకుండా పడి ఉన్నాయని, వాటిని భారతదేశానికి తీసుకురావాలని కోరారు. ఆ అస్థికలు నేతాజీవి అవునా.. కాదా.. అని  డీఎన్ఏ పరీక్షలు చేసి తేల్చలేమా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు మూడు సార్లు ఆస్థికలు తేవడానికి ప్రయత్నించినా కుదరలేదన్నారు పవన్ కల్యాణ్. వంద రూపాయల నోట్ పై నేతాజీ బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. 

దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లే తనకు జీవితం అంటే ఏంటో తెలిసిందన్నారు పవన్ కల్యాణ్. సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని చెప్పారు. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైనవని తెలిపారు. త్రివిక్రమ్  వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానన్నారు పవన్ కళ్యాణ్. నేతాజీ నిస్వార్థ దేశభక్తుడని, ఆయన సాయుధ పోరాటం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు ఎంవీఆర్ శాస్త్రి. దేశం బయట ఆజాద్ హింద్ ఫౌజ్ అద్భుత సమరమని చెప్పారు. నేతాజీ పుస్తకం థ్రిల్లర్ లాగే అద్భుత కథనమని తెలిపారు. 

పవన్ కల్యాణ్  లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన నేతాజీ గ్రంథ సమీక్షలో పవన్ కల్యాణ్ తో పాటు డాక్టర్ పద్మజారెడ్డి పాల్గొన్నారు. నేతాజీ అస్థికలు స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రజలు ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు పవన్ కల్యాణ్.