సీఎం పదవి కాదు.. జన సంక్షేమమే నాకు ముఖ్యం : పవన్ కల్యాణ్

రాజమండ్రి :ఏపీలో అడ్డగోలుగా దోచుకుంటున్న పాలకులను చూస్తూ ఊరుకోం. ప్రశ్నిస్తాం. నిలదీస్తాం. నేలకు దించుతాం. యాంటీ గాంధీ.. యాంటీ అంబేద్కర్ విధానాలు అవలంబిస్తున్న నాయకులకు జవాబు చెప్పి మార్పు చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.

రాజమండ్రి లో జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడారు. చిన్నప్పటినుంచీ వీడు పిచ్చోడని నన్ను చాలామంది అన్నారు. కానీ..నేను చిన్నప్పటినుంచి ఎంత టెస్ట్ చేసుకున్నానో మీకేం తెలుసు. పవన్ కల్యాణ్ ను పవన్ కల్యాణ్ టెస్ట్ చేసినంతగా ఇంకెవరూ చేయలేదు. ఒళ్లు హూనం చేసుకుని… కష్టపడి సంపాదించిన ఇమేజ్ నాది. అన్యాయంపై పోరాటం చేసే శక్తివి నీవు. బలంగా గళం వినిపించే గుండె ధైర్యానివి నీవు అని నా అంతరాత్మ చెప్పింది.

నా సినిమాలకు పోస్టర్లు ఎవరూ వేయలేదు. పబ్లిసిటీ ఇవ్వలేదు. మీరు ఇష్టపడ్డారు కాబట్టే నేను స్టార్ అయ్యాను. విజయం వస్తే పొంగిపోయారు. ఓటమి వస్తే భుజం కాశారు. నా సొంత వాళ్లు నన్ను దూరం పెట్టారు. కానీ నా అన్నదమ్ములు, ఆడపడుచులు నన్ను అక్కున చేర్చుకున్నారు. మీకోసం ఏదైనా చేస్తా” అన్నారు.

పాకిస్థాన్ పై కాదు.. నిరుద్యోగంపై యుద్ధం చేయండి : ప్రధాని మోడీపై విమర్శలు

తన ప్రసంగంలో ప్రధానమంత్రిపైనా విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. పాకిస్థాన్ పై కాదు…. దేశంలోని నిరుద్యోగంపై యుద్ధం ప్రకటించి యువతకు దారి చూపాలని పవన్ కల్యాణ్ అన్నారు.

“రాజకీయాల్లోకి రావడానికి గుండెధైర్యం కావాలి. డబ్బులు అవసరం లేదు. 2014లో నా దగ్గర జనం లేరు. సమాజం మారాలి.. వ్యవస్థ మారాలి.. మార్పు రావాలి కోరుకుంటున్న అన్నదమ్ములున్నారు. మార్పు వస్తుంది. నేను అడుగువేస్తే.. తల తెగాలి కానీ..మడమ తిప్పను. మార్పు ఒక్కరు కోరుకుంటే రాదు అని నాగబాబు అన్నయ్య ఓ మాట చెప్పారు. సమాజం గర్భదారణ పరిస్థితుల్లో ఉంటే నాయకుడు మంత్రసాని పనిచేస్తాడు. జనం మార్పుకోరుకున్నప్పుడే ఆ సమాజాన్ని ఓ నాయకుడు నడిపించగలడు. మీరు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి నేను మీ ముందున్నా. నా భవిష్యత్తు వదులుకుని మీకు భవిష్యత్తు ఇచ్చేందుకు వచ్చాను” అన్నారు.

“గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో… నాకు చాలామంది సలహా ఇచ్చారు. సినిమాలు మానెయ్. చంద్రబాబుతో మాట్లాడి ఇన్ ఫ్రా ప్రాజెక్టు తీసుకో. డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నారు. డబ్బు నాకెందుకు.. పవన్ కల్యాణ్ కు డబ్బెందుకు… నేను ఇవ్వడానికి వచ్చాను.. తీసుకోవడానికి రాలేదు. పవర్ స్టార్ స్టేటస్ కంటే … ఈ సీఎం పదవి ఏమాత్రం పెద్దది కాదు. ఆ సినిమాలనే పక్కనపెట్టి వచ్చాను. అధికారంలోకి వస్తే మార్పు చూపిస్తాను” అన్నారు పవన్ కల్యాణ్.

గెలిస్తే నేనేం చేస్తానంటే..

“పోరాటయాత్రలో ఉన్నప్పుడు జనం నన్ను అడిగారు. నాకు మంచి నీళ్లివ్వమన్నారు. ఓ ప్రైమరీ హెల్త్ కేర్ లో డాక్టర్ ఉండేలా చూడమన్నారు. ప్రాజెక్టుల కింద భూమికోల్పోయిన రైతులు పరిహారం కోరారు. పది కేజీల బియ్యం వద్దు. పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వు అన్నారు. యువత తమకు నిరుద్యోగ భృతి వద్దు అన్నారు. మేం నిలబడి సంపాదించుకునే భరోసా ఇవ్వమన్నారు. జనసేన మేనిఫెస్టో నిర్ణయించింది. ప్రజలకేం కావాలో అదే మా మేనిఫెస్టో. నా పోరాట యాత్ర నేర్పించింది అదే.

ప్రజారాజ్యం యూత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదిలాబాద్ లో ఓ గిరిజన తండాకు వెళ్తే.. ఓ గుడ్డి అవ్వ తాగడానికి నీళ్లు అడిగింది. అక్కడ ఓ బోర్ వేయించాను. ఓ వ్యక్తి అడిగితే ఇవ్వగలిగింది.. వ్యవస్థ అడిగితే చేయలేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం.. ఇలాంటి అంశాల్లో జనం కోరిన అభివృద్ధి చేసి చూపిస్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.