నా రెండో పెళ్లిపై మీ ఇంట్రస్ట్ ఏంటి..? ఇచ్చి పడేసిన రేణు దేశాయ్

నా రెండో పెళ్లిపై మీ ఇంట్రస్ట్ ఏంటి..? ఇచ్చి పడేసిన రేణు దేశాయ్

సినీ నటి రేణు దేశాయ్ తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇన్ స్టాగ్రాం స్టోరీలో పోస్ట్ పెట్టారు. మీడియా జనాలకి సమాజంలో నెలకొన్న సమస్యల కంటే తన రెండో పెళ్లి టాపిక్పై ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టుందని మీడియాపై రేణు దేశాయ్ సెటైర్ విసిరారు. రీసెంట్గా తాను ఒక పాడ్కాస్ట్లో గంటకు పైగా మాట్లాడానని, ఈ సందర్భంలో కూడా తన రెండో పెళ్లిపై తెగ ఆసక్తి కనబర్చడం గమనించానని చెప్పారు.

44 ఏళ్ల మహిళ రెండో పెళ్లిపై పెట్టిన శ్రద్ధను మహిళల భద్రతపైన, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం పైన, వాతావరణంలో సంభవిస్తున్న విపరీతమైన మార్పుల పైన పెడితే మేలని రేణు దేశాయ్ తన ఇన్ స్టా స్టోరీలో సూచించారు. ఉత్తమ వ్యక్తిత్వంతో ఒక మనిషి ఎలా జీవించాలని, ఉత్తమ పౌరుడిగా ఎలా నడుచుకోవాలనే విషయాలను పాడ్కాస్ట్లో తాను వివరించానని, అది వదిలేసి తన రెండో పెళ్లిపై ఆసక్తి కనబర్చడం ఏంటని రేణు దేశాయ్ విస్తుపోయారు. తన పెళ్లి గురించి తాను ఇప్పటికే వందల సార్లు మాట్లాడానని, ఇది తన జీవితంపై, తన సన్నిహితుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రేణు దేశాయ్ తెలిపారు.

‘బద్రి’ సినిమాలో పవన్ కల్యాణ్తో కలిసి నటించిన రేణు దేశాయ్ను 2009లో పవన్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ‘జానీ’ సినిమాలో కూడా పవన్, రేణు దేశాయ్ కలిసి నటించారు. 2012లో పరస్పర అంగీకారంతో పవన్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ ఇద్దరు పిల్లల బాధ్యతలను చక్కబెట్టాల్సిన స్థానంలో ఉన్న తాను వెనకడుగు వేసినట్లు ఆమె తెలిపారు. ‘ఆద్య’కు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే.. రేణూ దేశాయ్ రెండో పెళ్లి గురించి ఆలోచన చేయాలని ప్రస్తుతం భావిస్తున్నారు.