ఇసుక దోపిడిలో టీడీపీకి, వైసీపీకి పెద్ద తేడా లేదు

ఇసుక దోపిడిలో టీడీపీకి, వైసీపీకి పెద్ద తేడా లేదు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మాణ రంగం సంక్షోభంలో పడిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వ నిర్ణయం కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగంతో పాటు, వాటి అనుబంధ రంగ కార్మికులు రోడ్డున పడ్డారన్న పవన్..ఇసుక ట్రాన్స్ పోర్ట్ లో ఉన్న కార్మికుల పొట్టకొట్టి.. బ్యాంక్ రుణాల ద్వారా యువతకు వాహనాల మంజూరు చేయాలంటూ జీవో ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  కొత్తగా ఇచ్చిన జీవోపై కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. రాజదానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స చేస్తున్న ప్రకటనలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఇసుక దోపిడిలో టీడీపీకి,  వైసీపీకి పెద్ద తేడా లేదన్న జనసేనాని.. అనంతపురం నుంచి బెంగుళూరుకు ఆంద్రా నుంచి తెలంగాణకు ఇసుక తరలిపోతుందన్నారు. అంబటి రాంబాబు తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు మాని..తాను అడిగే  ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళన చూస్తుంటే మరో 5ఏళ్ళు ఇలాగే కొనసాగుతుందేమోనని పవన్ సందేహం వ్యక్తం చేశారు.