
- కాంగ్రెస్ నేతలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్
- మధుసూదన్ కుటుంబానికి జనసేన రూ.50 లక్షలు సాయం
హైదరాబాద్, వెలుగు: కొందరు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్‌ను ప్రేమించేవాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లా డుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని.. కశ్మీర్ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. పహల్గాం అమరులకు మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నివాళి అర్పించింది.
ఉగ్రదాడి మృతులకు పవన్ సంతాపం తెలిపారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. సెక్యులరిజం పేరుతో కొందరు సౌత్ కాంగ్రెస్ నేతలు పాక్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇండియాలో పుట్టి.. ఇండియాలో ఉంటూ.. కొందరు పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. టెర్రరిస్ట్ ఘాతుకానికి బలైన మధుసూదన్ కుటుంబ సభ్యులకు జనసేన తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, ఎలాంటి అవసరాలకైనా జనసేన సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.