
- ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారి హైదరాబాద్కు
- ఘన స్వాగతం పలికిన చిరంజీవి ఫ్యామిలీ
- అమ్మ, అన్నకు పాదాభివందనం చేసిన జనసేనాని
హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చారు. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన పవన్ కుటుంబం.. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటికి చేరుకుంది. చిరంజీవి దంపతులు, తమ్ముడు నాగబాబు, కుమారుడు రాంచరణ్–ఉపాసన దంపతులు, వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ.. పవన్ పై పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు.
‘జై జనసేన’ అని నినాదాలు చేశారు. అమ్మ అంజనమ్మ, అన్న చిరంజీవికి పవన్ పాదాభివందనం చేశారు. అనంతరం తల్లి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. పవన్ ను భారీ గజమాలతో చిరంజీవి సన్మానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
అల్లు అరవింద్ ఫ్యామిలీ దూరం
పవన్ కల్యాణ్ విజయోత్సవాల్లో అల్లు అరవింద్ ఫ్యామిలీ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం చిరంజీవి వెంట ఉండే అల్లు అరవింద్ ఈ వేడకలకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రను అల్లు అర్జున్ వెళ్లి కలవడం మెగా ఫ్యాన్స్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ప్రతిపక్ష అభ్యర్థి దగ్గరకు ఎలా వెళతావని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు.