
ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ
బీజేపీకి తానెప్పుడూ దూరంగా లేనన్న జనసేన చీఫ్
అమిత్ షా అంటే గౌరవమని వ్యాఖ్య
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీ వైపు చూస్తున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే చర్చ. ఆయన చేస్తున్న కామెంట్లే ఇందుకు ఆస్కారమవుతున్నాయి. ఇప్పటి పాలిటిక్స్‌కు ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షానే కరెక్ట్ అని మంగళవారం వ్యాఖ్యానించిన పవన్.. తాజాగా అమిత్ షా అంటే తనకు గౌరవం అని తెలిపారు. బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనని, కలిసే ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో సిద్ధాంతపరంగానే బీజేపీని విభేదించానని బుధవారం తిరుపతి పర్యటనలో ఆయన అన్నారు. ‘అమిత్ షా అంటే వైఎస్సార్సీపీకి భయం.. నాకు మాత్రం ఆయనంటే గౌరవం. అందుకే వైఎస్సార్సీపీ నేతలకు విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేయడం తెలియదు’ అని విమర్శించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో తాను కలిస్తే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేదా అని పవన్ ప్రశ్నించారు. నైతిక విలువలకు కట్టుబడే తాను కలవలేదని, వైఎస్సార్సీపీ నేతలు తనకు దండం పెట్టాలని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి, ఏపీలో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కొన్నాళ్లుగా ఆ రెండు పార్టీలకు దూరం పాటిస్తూ వస్తోంది. ఏడునెలల క్రితం జరిగిన లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి జనసేన పోటీ చేసింది.
ఇటీవల వైజాగ్‌లో ‘భవన నిర్మాణ కార్మికుల మార్చ్’ వేదికగా పవన్ కల్యాన్.. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికులు చనిపోతున్నా రాష్ట్ర సర్కార్‌కు పట్టడం లేదని మండిపడ్డారు. తనకు ఢిల్లీలో బలమైన నాయకులు తెలుసని అదే వేదికపై అన్నారు. అటు తర్వాత కొన్నిరోజులకు పవన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. తాజాగా జగన్ సర్కార్‌ను దుయ్యబడుతూనే.. మోడీని, అమిత్‌షాను ఆయన ప్రశంసించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిరేపుతోంది. బీజేపీ వైపు వెళ్లేందుకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మతమార్పిడుల వెనుక ఎవరున్నరు?: పవన్
రైతు సమస్యలు, నిత్యావసరాల ధరల పెంపు, రాయలసీమ వెనకబాటుతనం, తెలుగు వైభవం, హిందూ ధర్మ పరిరక్షణ తదితర అంశాలపై బుధవారం తిరుపతిలో జనసేన నాయకులతో పవన్‌కల్యాణ్ చర్చించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కష్టపడితే గానీ పరిశ్రమలు రావని, కానీ పారిశ్రామిక వేత్తలను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై తన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ వక్రీకరించిందన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారని, ఎవరి అండతో రాష్ట్రంలో సామూహిక మత మార్పిడిలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం చదువులను తాను పూర్తిగా వ్యతిరేకించడం లేదని, పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీసీ దృష్టి అంతా కూల్చివేతలపై పడిందని, గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే సరిపెడుతోందని దుయ్యబట్టారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని ఏపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.