
ప్రముఖ కోలీవుడ్ నటుడు, కరాటే నిపుణుడు షిహాన్ హుసైని (60) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం (మార్చి 25న) తుదిశ్వాస విడిచారు. షిహాన్ హుసైని మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌లో ధృవీకరించారు.
ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు, ప్రజలు మరియు విద్యార్థుల నివాళులర్పించడం కోసం చెన్నైలోని బెసెంట్ నగర్‌లోని ఆయన నివాసం హైకమాండ్‌లో ఉంచుతారు.ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు సహా మార్షల్ ఆర్ట్స్ సమాజం షిహాన్ హుసైని మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. షిహాన్ హుసైని హీరో పవన్ కళ్యాణ్ కు గురువు.
పవన్ కళ్యాణ్ కరాటేలో శిక్షణ:
షిహాన్ హుసైని టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కరాటేలో శిక్షణ ఇచ్చాడు. అలాగే దళపతి విజయ్ కూడా ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్ ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్‌తో పాటు కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.
పవన్‌ను అభ్యర్థించిన షిహాన్ హుస్సేని:
ఇటీవలే షిహాన్ హుసైని.. హీరో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "తన శిక్షణా కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ను కొనమని కోరాను.. అలాగే తన వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలో కళ్యాణ్ కుమార్ గా ఉన్న తన పేరును, పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ మాటలు అతని చెవులకు చేరితే అతను తప్పకుండా స్పందిస్తాడని తెలుసు. అతను ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రాన్ని కొనుగోలు చేసి భవిష్యత్ తరాల కోసం నిర్వహిస్తారని ఆశిస్తున్నాను" అని ఆయన కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మాటలు వైరల్ అవుతున్నాయి.
షిహాన్ హుస్సేని సినీ ప్రస్థానం:
1986లో కమల్ హాసన్ నటించిన పున్నగై మన్నన్ సినిమాతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన వేలైకరన్, బ్లడ్ స్టోన్ వంటి తమిళ చిత్రాలలో నటించారు. దళపతి విజయ్ నటించిన బద్రి సినిమాలో ఆయన కరాటే కోచ్ పాత్ర పోషించారు. ఆయన నటించిన చివరి చిత్రాలు విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ మరియు చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్.
షిహాన్ హుస్సేని సినిమాల్లో నటించడమే కాకుండా, ఆయన అనేక రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా మరియు వ్యాఖ్యాతగా కూడా కనిపించారు. యుద్ధ కళలు మరియు విలువిద్యలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశాలి హుస్సేని.