
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే తూర్పుకాపుల జనగణన చేపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ‘వారాహి యాత్ర’లో భాగంగా భీమవరంలో తూర్పుకాపు రాష్ట్రస్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తనకు బలమైన జ్ఞాపకాలను ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుకాపుల సంక్షేమానికి బీజం ఇక్కడే పడిందని చెప్పారు. తూర్పుకాపులు తమ సమస్యలు చెప్పినప్పుడు క్షుణ్ణంగా విన్నానని, వారి క్షోభను దగ్గరి నుంచి చూశానని పవన్ అన్నారు.
వంశధార నిర్వాసితుల్లో ఎక్కువమంది తూర్పుకాపులేనన్న పవన్... వాళ్లు ఎక్కువగా వలసలు వెళ్తున్నారని చెప్పారు. దేశంలో ఏ నిర్మాణం వెనుకైనా ఉత్తరాంధ్ర తూర్పు కాపులున్నారని చెప్పారు. వారి జనాభాపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో లెక్క చెబుతోందని, ఏ ప్రాతిపదికన లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. జనసేన వస్తే ముందుగా లెక్కలు తీస్తామని తెలిపారు. తెలంగాణ సమాజంలోనూ తూర్పుకాపుల సంఖ్య ఎక్కువనేన్నారు. అందుకే సమాజానికి ఎంతో చేస్తున్న తూర్పు కాపులకు ఏదోఒకటి చేయాలని పరితపిస్తున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.