ఏపీలో రోజురోజుకీ పొలిటికల్ హీట్ రెట్టింపవుతోంది. అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించి అధికార వైఎస్సార్సీపీ రేసులో దూసుకుపోతుంటే, పొత్తు విషయంలో తర్జనభర్జనలు పడి ఇటీవలే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది టీడీపీ, జనసేన కూటమి. అయితే, ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్న సీట్ల పంపకం పంచాయితీ ఒక కొలిక్కి వచ్చిందన్న ఆనందం కంటే కూడా అసమ్మతి సెగ ఇరుపార్టీలకు గట్టిగానే తగులుతోంది. ఇరు పార్టీల శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తున్నారు. ఇరు పార్టీల అధిష్టానాలు అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డాయి.
టీడీపీ, జనసేన కూటమి ప్రకటించిన 118 సీట్లల్లో జనసేన కేవలం 24 సీట్లకే పరిమితం కావటం పట్ల కూడా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎక్కడి నుండి పోటీ చేయబోయే స్థానం ప్రకటించకపోవడం కూడా జనసన కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. జనసేనకు కేటాయించిన 24సీట్లలో కేవలం 5స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాడు పవన్.
ALSO READ :- అలెర్ట్..ఆండ్రాయిడ్ యూజర్లకు మరో మాల్వేర్ ముప్పు.. గూగుల్ క్రోమ్ రూపంలో..
పవన్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించకపోవడం విస్తృత చర్చకు దారి తీసింది. జనసేనాని అసెంబ్లీ బరి నుండి తప్పుకుంటున్నాడని ప్రచారం మొదలైంది. పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేయాలన్న ఆలోచన కూడా విరమించుకున్నాడని, ఎదో అసెంబ్లీ స్థానం, ఇంకొక ఎంపీ స్థానం నుండి పవన్ పోటీ చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిస్తే, కేంద్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి స్థానాన్ని పొంది ఢిల్లీలో చక్రం తిప్పచ్చని, ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రం ప్రభుత్వంలో పవర్ షేరింగ్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాడట పవన్. మొత్తానికి జనసేన శ్రేణులను కలవరపెడుతున్న ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.