పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. దసరా సీజన్‎లో ఓజీ రిలీజ్..!

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. దసరా సీజన్‎లో ఓజీ రిలీజ్..!

పవన్ కళ్యాణ్‌‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఇమ్రాన్ హష్మీ విలన్‌‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం యాభై శాతంకు పైగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌‌ ఎన్నికలతో బిజీ అవడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో షూటింగ్‌‌కు బ్రేక్ పడింది. ప్రభుత్వ కార్యకలాపాల ఒత్తిడిలోనూ వీలు చూసుకుని ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌‌ను ఆయన పూర్తి చేస్తున్నారు. 

ఇది పూర్తయ్యాక ‘ఓజీ’ చిత్రానికి కూడా డేట్స్‌‌ కేటాయించనున్నారు. ఓటీటీ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మే లేదా జూన్‌‌ నెలలో షూటింగ్‌‌ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరో ఇరవై ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్‌‌ ఈ చిత్రం షూటింగ్‌‌లో పాల్గొనాల్సి ఉంది. మొత్తానికి ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి రెండు చిత్రాలు రాబోతున్నాయి. మే 9న ‘హరిహర వీరమల్లు’ రానుండగా, దసరా సీజన్‌‌లో ‘ఓజీ’ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.