నల్లగొండలో ఫ్లోరోసిస్​ సమస్య కలిచివేసింది : పవన్ ‌‌ కల్యాణ్

  • వాటర్​ప్లాంట్లు పెట్టేందుకు వస్తే అప్పట్లో అడ్డుకున్నరు
  • అవినీతి రహిత పాలన కోసం బీజేపీ, జనసేనకు ఓటేయండి
  •  పవన్ ‌‌ కల్యాణ్​ పిలుపుటూర్​ సక్సెఎస్​తో బీజేపి శ్రేణుల్లో జోష్ ‌‌

సూర్యాపేట, వెలుగు : ‘2001లో తమ్ముడు సినిమా విజయోత్సవ కార్యక్రమానికి నల్లగొండ జిల్లాకు వచ్చిన.. అప్పుడు ఫ్లోరోసిస్ ‌‌బాధితులను చూడగానే నా మనస్సు కలచివేసింది..  ఇలాంటి వారికి న్యాయం జరగాలంటే రాజకీయాల్లోకి రావాలని నాడే  నిర్ణయించుకున్న..2009లో నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ ‌‌గ్రామాల్లో తిరిగి వాటర్ ‌‌ప్లాంట్స్​ పెట్టేందుకు సిద్ధమయ్యా.. కానీ స్థానికంగా ఉన్న కొన్ని రాజకీయ శక్తులు నన్ను అడ్డుకున్నాయి..’ అని జనసేన అధినేత, సినీ నటుడు  పవన్ ‌‌ కల్యాణ్​సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జనసేన పార్టీ స్థాపించడానికి నల్లగొండ జిల్లానే  కారణమని పవన్​చెప్పారు. గురువారం సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్​నగర్​ బీజేపీ అభ్యర్థులు సంకినేని వెంకటేశ్వరరావు,  కడియం రామచంద్రయ్య,  శ్రీలతరెడ్డి,  జనసేన అభ్యర్ధి  మేకల సతీష్ ‌‌కు మద్దతుగా సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ ‌‌వరకు నిర్వహించిన రోడ్ ‌‌షో లో పవన్​ పాల్గొని మాట్లాడారు.  అవినీతిరహిత పాలన కోసం బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

గడిచిన పదేండ్లలో  సూర్యాపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకే సంక్షేమ పథకాలు అందాయన్నారు.  అమృత్ స్కీమ్ కింద సూర్యాపేట మున్సిపాలిటీ కి ఫండ్స్ మంజూరు చేస్తే అవి రాష్ట్ర ప్రభుత్వ నిధులు అని మంత్రి చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాగా,  తమ అభిమాన నటుడిని చూసేందుకు పవన్ ఫ్యాన్స్​, సామాన్య జనం రోడ్​షోకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 

దీంతో ఎస్వీ కాలేజ్​ నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ ‌‌వరకు రోడ్డంతా ఇసుకేస్తే రాలనంత జనంతో  కిటకిటలాడింది. దీంతో జనాన్ని  కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఒకదశలో పవన్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.