కార్తీ సారీ ట్వీట్ కి సుతిమెత్తగా రిప్లై ఇచ్చిన పవన్...

ప్రస్తుతం ఆంధ్రాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదంపై తీవ్ర దుమారం రేగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిందన్న ఆరోపణలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా మరింత అగ్గి రాజేశాయి.

ALSO READ | Hero Karthi: నేనేమీ తప్పుగా మాట్లాడలేదు పవన్ సార్.. అయినా సారీ : హీరో కార్తీ

దీంతో పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వివాదంపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం నడుస్తున్న ఈ తరుణంలో తమిళ సినీ నటుడు కార్తీ స్పందించిన తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో ట్విటర్ వేదికగా కార్తీ క్షమాపణ చెప్పాడు. కార్తీ స్పందనపై పవన్ కల్యాణ్ ఇదే సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తమిళ నటుడు కార్తీ ట్వీట్పై  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన యథాతథంగా..

డియర్ కార్తీ గారూ..

మీరు ఈ అంశంపై సత్వరం స్పందించిన తీరును అభినందిస్తున్నాను. మన ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆధ్యాత్మికత వెల్లివిరిసే తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలకు సంబంధించి, అక్కడి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి స్పందించే సందర్భంలో మనమంతా లక్షలాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లే ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, యథాలాపంగా మాట్లాడినవేనని అర్థం చేసుకున్నాను.

అయినప్పటికీ.. మన సాంప్రదాయాల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల స్పందించే సందర్భంలో సెలబ్రెటీలుగా మనం బాధ్యతగా వ్యవహరించాలి. సినిమా అనే మాధ్యమంతో ఆధ్యాత్మిక శోభను, విలువలను మరింత విరాజిల్లేలా చేయాలని ఆకాంక్షిస్తు్న్నాను. ఒక నటుడిగా మీ నటనకు, నటనలో మీరు చూపే అంకిత భావానికి మీకు నా ప్రశంసలు తెలుపుతున్నాను. నటనలో మీరు మరింతగా అంకిత భావంతో ముందుకెళ్లాలని, మన సినిమా స్థాయిని మరింత పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.. 

ఇక త్వరలో కార్తీ మరియు అరవింద స్వామి హీరోగా నటించిన సత్యం సుందరం చిత్రం విడుదల కాబోతుండటంతో చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.