వరంగల్, వెలుగు : తెలంగాణలో కమీషన్ల రాజ్యం, గూండాల పాలన కొనసాగుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. బుధవారం ఆయన గ్రేటర్ వరంగల్ లో పర్యటించారు. బీజేపీ వరంగల్ తూర్పు, పశ్చిమ అభ్యర్థులు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, రావు పద్మ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ హంటర్ రోడ్‍లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో తిరిగినట్లే తెలంగాణలోనూ తిరుగుతానన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా, నాలుగు కోట్ల మంది ప్రజలపై ఉన్న గౌరవంతోనే బీఆర్‍ఎస్ ప్రభుత్వంపై దశాబ్ద కాలంగా తాను ఏం మాట్లాడలేదన్నారు. తనకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితోనే జనసేన స్థాపించానన్నారు.
ప్రధాని మోదీ అంటే తనకు ఎనలేని గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణలోను జనసేన ఉంటుందన్నారు. బీసీని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతోనే బీజేపీతో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ లో బీజేపీ క్యాండేట్లు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, రావు పద్మను ప్రజలు ఓట్లేసి గెలిపించాలని కోరారు.